google: ఎయిర్ టెల్ లోనూ గూగుల్ భారీ పెట్టుబడులు.. 1.28 శాతం వాటా

  • బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమైన గూగుల్
  • 7,11,76,839 షేర్ల కొనుగోలు
  • ఇందుకోసం 700 మిలియన్ డాలర్లు
  • వాణిజ్య ఒప్పందాలకు 300 మిలియన్ డాలర్లు
Google to invest up to billion dollars in Bharti Airtel

రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ లో లోగడ భారీ పెట్టుబడులు పెట్టిన గూగుల్.. ఇప్పుడు టెలికం రంగంలో రెండో బడా సంస్థ ఎయిర్ టెల్ తలుపు కూడా తట్టింది. బిలియన్ డాలర్ల పెట్టుబడులతో (రూ.7,400 కోట్లు) ముందుకు వచ్చింది. ఇందులో 700 మిలియన్ డాలర్లను ఎయిర్ టెల్ లో 1.28 శాతం వాటా కొనుగోలుకు వ్యయం చేయనుంది. మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్ తో వాణిజ్య లావాదేవీలను కుదుర్చుకోనుంది.

అన్ని రకాల ధరల శ్రేణిలో స్మార్ట్ ఫోన్లను అందుబాటు ధరలకు అందించడంపై దృష్టి పెట్టనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. గూగుల్ నుంచి అందే పెట్టుబడులను ఇందుకు వినియోగించనుంది. 5జీ కోసం భారత్ కోసమే ఉద్దేశించిన నెట్ వర్క్ డొమైన్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించనున్నట్టు తెలిపింది.

డీల్ లో భాగంగా గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్ సీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ కు చెందిన 7,11,76,839 షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.734 వెచ్చిస్తుంది. ఇందుకు రూ.5,224.38 కోట్లు అవుతాయి. 2020లో రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్స్ లో గూగుల్ రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తద్వారా 7.73 శాతం వాటాను సొంతం చేసుకుంది.

More Telugu News