అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

28-01-2022 Fri 14:06
  • ఈవీల భవిష్యత్ జీఎం, ఫోర్డ్ దేనన్న బైడెన్
  • టెస్లాను ప్రస్తావించకపోవడంతో మస్క్ ఆక్రోశం
  • మనిషి రూపంలోని తడిసిన తోలుబొమ్మ అంటూ మండిపాటు
  • అమెరికన్లను ఫూల్స్ చేస్తున్నారని ఆగ్రహం
Biden A Damp Sock Puppet Says Musk
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనో మనిషి రూపంలోని తడిసిపోయిన తోలు బొమ్మ అంటూ మండిపడ్డారు. అమెరికాలో విద్యుత్ వాహన శ్రేణి భవిష్యత్ పై పెట్టిన పోస్టులో ‘టెస్లా’ పేరును బైడెన్ ప్రస్తావించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

జీఎం, ఫోర్డ్ వంటి సంస్థలు ఇంతకుముందు కన్నా ఇప్పుడు  దేశంలో ఎక్కువ విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నాయంటూ బైడెన్ ట్వీట్ చేశారు. దానిపైనే స్పందించిన మస్క్.. బైడెన్ ఒక ‘డ్యాంప్ సాక్ పప్పెట్’ అంటూ ట్వీట్ చేశారు. అమెరికా ప్రజలను బైడెన్ ఫూల్స్ లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పలువురు నెటిజన్లూ బైడెన్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రెండు సంస్థల పేర్లనే బహిరంగంగా ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ వాహన రంగంలో కొత్త చరిత్రను లిఖించిన సంస్థను ఆ చరిత్ర నుంచి చెరిపేసే కుట్ర చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

కాగా, ఇటీవలే జీఎం, ఫోర్డ్ సంస్థల సీఈవోలతో బైడెన్ వైట్ హౌస్ లో సమావేశమయ్యారు. విద్యుత్ వాహనాల కోసం సరికొత్త చట్టం చేస్తామంటూ బైడెన్ వారికి హామీ ఇచ్చారు. అయితే, మస్క్ ను మాత్రం ఈ సమావేశానికి పిలవలేదు.