చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం ద‌ద్ద‌రిల్లేలా చేయాలి: అమ‌రావ‌తి ఐకాస‌ అధ్య‌క్షుడు బొప్పరాజు

28-01-2022 Fri 13:37
  • రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పోరాడుతున్నారు
  • ఫిబ్ర‌వ‌రి 3న చేప‌ట్ట‌నున్న ఛ‌లో విజ‌య‌వాడ
  • ఉద్యోగుల ఆందోళ‌న‌ల‌ను ప్ర‌భుత్వం పట్టించుకోవ‌ట్లేదు
  • పీఆర్సీ నివేదిక‌ను ఎందుకు దాచిపెడుతున్నార‌న్న బొప్ప‌రాజు
boppa raju slams ycp
ఏపీ ప్ర‌భుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. గుంటూరు జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉద్యోగ సంఘాలు రిలే దీక్ష‌లు చేస్తున్నాయి. పీఆర్సీ, జీవోల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు కోరుతున్నారు. ఈ రోజు ఈ దీక్ష‌కు హాజ‌రైన అమ‌రావ‌తి ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి అధ్య‌క్షుడు బొప్పరాజు మాట్లాడుతూ... ఏపీ స‌ర్కారుపై మండిప‌డ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పోరాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఫిబ్ర‌వ‌రి 3న చేప‌ట్ట‌నున్న ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని దద్ద‌రిల్లేలా చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఆందోళ‌న‌ల‌ను ప్ర‌భుత్వం పట్టించుకోవ‌ట్లేద‌ని తెలిపారు. పీఆర్సీ నివేదిక‌ను ఎందుకు దాచిపెడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు, నేడు ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు కీలక భేటీ కానున్నాయి.

ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయం మేరకు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై నేటి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్య వేదిక పేరిట ఆర్టీసీ ఉద్యోగులు సమావేశం కానున్నారు.