ఆదిపురుష్.. ప్రపంచంలోని 20 వేల స్క్రీన్లలో రిలీజ్?

28-01-2022 Fri 12:40
  • 15 భారతీయ భాషలతో పాటు వివిధ దేశాల భాషల్లో విడుదల
  • రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా
  • ఇప్పటికే షూటింగ్ పూర్తి
  • పాన్ వరల్డ్ సినిమా అంటున్న నెటిజన్లు
Prabhas Adupurush To Release In 20000 Screens
ప్రభాస్ ప్రస్తుతం మాంచి జోష్ లో ఉన్నాడు. చేతి నిండా ఆఫర్లతో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తీసిన ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధమైంది. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్టులూ అతడి బకెట్ లిస్టులో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ చేయనున్న ప్రభాస్.. రామాయణ కావ్యం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించనున్న భారీ పురాణగాథ ‘ఆదిపురుష్’లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. రాముడిగా కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఆదిపురుష్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం.

15 భారతీయ భాషలతో పాటు వివిధ దేశాల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20 వేల స్క్రీన్లపై సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో నెటిజన్లు ఆ సినిమాను పాన్ వరల్డ్ సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు.