రాజకీయాల వైపుగా తమిళ హీరో విజయ్ కీలక అడుగు!

28-01-2022 Fri 12:38
  • పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన అభిమానులకు అనుమతి
  • ప్రచారంలో తన ఫొటో వాడుకోవడానికి గ్రీన్ సిగ్నల్
  • తమిళనాట చర్చనీయాంశంగా మారిన విజయ్ నిర్ణయం
Tamil star Vijay key step towards politics
తమిళనాడులో సినిమా వాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎంలు సినిమా వాళ్లే కావడం అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలితను తమిళ జనాలు నెత్తిన పెట్టుకున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు మరెందరో స్టార్లు రాజకీయాల్లో ఉన్నారు. కమలహాసన్, విజయకాంత్ తదితరులకు సొంత పార్టీలు ఉన్నాయి.

రజనీకాంత్ కూడా పార్టీ కోసం అంతా సిద్ధం చేసి అనారోగ్య కారణాలతో చివరి క్షణాల్లో రాజకీయాల ఆలోచనను విరమించుకున్నారు. అగ్ర హీరోలు విజయ్, అజిత్ ల అభిమానులు కూడా వారు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అయితే అజిత్ తనకు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ప్రకటించారు. విజయ్ మాత్రం ఏరోజుకైనా రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు. ఇప్పుడు ఆ దిశగా తొలి అడుగు పడింది.

తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు తన అభిమాన సంఘం 'ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్' సభ్యులకు విజయ్ అనుమతిచ్చాడు. వీరంతా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అంతేకాదు ప్రచార సమయంలో తన ఫొటోలకు ఉపయోగించుకోవడానికి కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫిబ్రవరి 19న పట్టణ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కొత్త చర్చ ప్రారంభమైంది. రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల బరిలోకి విజయ్ దిగే అవకాశం ఉందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.