మద్దతు ధర ఒక మాయ: తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

28-01-2022 Fri 12:24
  • అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా వ్యవసాయరంగం
  • సామాజిక బాధ్యతగా భావించి చ‌ర్యలు తీసుకుని ఉండవలసింది
  • ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చ‌ర్యలు తీసుకోవ‌ట్లేదు
  • ఇచ్చే సబ్సిడీలు నిర‌ర్థ‌క‌మ‌న్న నిరంజ‌న్ రెడ్డి
Singireddy Niranjan Reddy slams bjp
'మద్దతు ధర ఒక మాయ' అంటూ కేంద్ర స‌ర్కారుపై తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్‌లో మండిప‌డ్డారు. ''సువిశాల వ్యవసాయ భారతావనిలో కోటానుకోట్ల మందికి (అత్యధిక శాతం మందికి) జీవనోపాధిగా ఉండే వ్యవసాయరంగాన్ని దూరదృష్టితో కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, శాశ్వతంగా ప్రజలకు ఆహార అవసరాలు తీర్చే రంగంగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి కేంద్రం ఇప్పటికే చర్యలు తీసుకుని ఉండవలసింది.

ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందనే ఆశ, నమ్మకం కలగడం లేదు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చి, రద్దు చేసిన నల్లచట్టాల నేపథ్యంలో కేంద్రం ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి దృష్టిలో వ్యవసాయం లాభసాటి కాదని, దానిపై పెట్టే పెట్టుబడులు, ఇచ్చే సబ్సిడీలు నిరర్ధకం అన్న భావన వారి చర్యలలో కనిపిస్తోంది'' అని సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.