ఓ ఎంపీపై దాడి జరిగితే ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు: బండి సంజయ్

27-01-2022 Thu 22:08
  • నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి
  • తీవ్రంగా ఖండించిన బండి సంజయ్
  • సీఎం ఆఫీసు దర్శకత్వంలోనే దాడి జరిగిందని ఆరోపణ
  • దాడిపై డీజీపీ, సీపీలకు ముందే తెలుసన్న సంజయ్   
Bandi Sanjay slams TRS leaders
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిజామాబాద్ జిల్లా నందిపేట్ లో మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై దాడి జరగడం పట్ల ఆయన స్పందించారు.

ఈ దాడికి సీఎంవో దర్శకత్వం వహిస్తే, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులే దాడి చేశారని అన్నారు. ఓ లోక్ సభ సభ్యుడిగా దాడి జరిగితే ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ పై దాడి జరుగుతుందన్న విషయం డీజీపీకి, పోలీస్ కమిషనర్ కు ముందే తెలుసని బండి సంజయ్ ఆరోపించారు.

టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఎంపీ అర్వింద్ పై దాడి చేశారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇంకెంతో కాలం అధికారంలో ఉండదని, మరొక్క ఏడాదిలో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని అన్నారు. ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని భావిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.