కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ అందాల రాణి

27-01-2022 Thu 21:28
  • ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ లో ఎన్నికలు
  • కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అనుకృతి గుసైన్
  • అనుకృతి మాజీమంత్రి హరాక్ రావత్ కోడలు
  • ఇటీవలే మంత్రి మండలి నుంచి ఉద్వాసనకు గురైన రావత్
  • కోడలితో కలిసి కాంగ్రెస్ లో చేరిన వైనం
Former beauty pageant Anukriti Gusain joins Congress party
మరికొన్ని వారాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, ఆయా పార్టీల్లో చేరికలు, వలసలు ఊపందుకున్నాయి. తాజాగా, మిస్ గ్రాండ్ ఇండియా మాజీ అందాలరాణి అనుకృతి గుసైన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనుకృతి ఉత్తరాఖండ్ మాజీ మంత్రి డాక్టర్ హరాక్ సింగ్ రావత్ కుమారుడు తుషిత్ రావత్ ను పెళ్లాడారు.

ఇటీవల హరాక్ సింగ్ రావత్ ను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించారు. దాంతో ఆయన బీజేపీ అధిష్ఠానంపై అలకబూని పార్టీని వీడారు. కోడలితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, అనుకృతి గుసైన్ ను కాంగ్రెస్ పార్టీ లాన్స్ డౌన్ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతోంది. అనుకృతి లాన్స్ డౌన్ ప్రాంతంలోని ఖండోలీ గ్రామంలో జన్మించారు.  ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.