కొత్త బిజినెస్ మొదలెట్టిన మంచు విష్ణు!

27-01-2022 Thu 18:36
  • హీరోగా మంచు విష్ణు బిజీ
  • నిర్మాతగాను వరుస సినిమాలు
  • డిజిటల్ కంటెంట్ పై దృష్టి
  • ఆ దిశగా మొదలైన సన్నాహాలు  
Manchu Vishnu updates
మంచు విష్ణు ఒక వైపున హీరోగా .. మరో వైపున నిర్మాతగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో హీరోగా .. నిర్మాతగా ఆయనకి సక్సెస్ అనేది దక్కలేదు. అయినా 24 ఫ్రేమ్స్ బ్యానర్ పై ఆయన సినిమాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డిజిటల్ కంటెంట్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.

'అవా ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై ఆయన ఓటీటీలకు అవసరమైన కంటెంట్ ను ఇచ్చేందుకుగాను రంగంలోకి దిగినట్టుగా చెప్పుకుంటున్నారు. క్రితం ఏడాది నుంచే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చారట. అయితే కరోనా కారణంగా ఆచరణలో పెట్టడానికి ఆలస్యమైందని అంటున్నారు. ఈ బ్యానర్ పై ఓటీటీ సినిమాలు .. వెబ్ సిరీస్ లు నిర్మిస్తారట.

ఒక వైపున 24 ఫ్రేమ్స్ వ్యవహారాలు చూసుకుంటూనే, మరో వైపున 'అవా' సంస్థకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ వ్యవహారాలు చక్కబెడుతూ వెళతాడని చెబుతున్నారు. ఇక ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసే ఆలోచన కూడా మంచు ఫ్యామిలీకి ఉందనే టాక్ కూడా మరోవైపు నుంచి వినిపిస్తోంది.