నాన్సెన్స్... సమంతాపై నా వ్యాఖ్యలను వక్రీకరించి రాశారు: నాగార్జున ఆగ్రహం

27-01-2022 Thu 18:24
  • విడిపోయిన నాగచైతన్య, సమంత
  • సమంతే విడాకులు కోరిందని నాగ్ అన్నట్టు కథనాలు
  • మండిపడిన నాగార్జున
  • వార్తలు ఇవ్వండి... పుకార్లను కాదు అంటూ హితవు
Nagarjuna fires on media stories about his comments on Samantha and Naga Chaitanya
టాలీవుడ్ లో ఒకప్పుడు అందమైన జోడీగా వెలుగొందిన నాగచైతన్య, సమంత జోడీ ఇటీవల విడిపోయింది. వారు విడిపోక ముందు ఓ మోస్తరుగా సాగిన ప్రచారం, విడిపోయాక మరింత ముదిరింది. తాజాగా తాను అనని వ్యాఖ్యలను కూడా అన్నట్టుగా రాశారంటూ అక్కినేని నాగార్జున మండిపడ్డారు. సమంతే విడాకులు కావాలని పట్టుబట్టిందని, ఆమె నిర్ణయాన్ని గౌరవించి నాగచైతన్య కూడా విడాకులకు సిద్ధమయ్యాడని నాగార్జున అన్నట్టుగా నేడు విస్తృతస్థాయిలో మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే ఈ కథనాలపై నాగ్ ట్విట్టర్ లో స్పందించారు. "సమంత, నాగచైతన్యలను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పూర్తి విరుద్ధంగా, తప్పుడు ధోరణిలో ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలు పూర్తిగా అబద్ధం. పుకార్లను వార్తలుగా ప్రచారం చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నాను" అంటూ విజ్ఞప్తి చేశారు. వార్తలు ఇవ్వండి... పుకార్లను కాదు అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.