కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించండి: బాలకృష్ణ

27-01-2022 Thu 17:32
  • ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు 
  • వీడియో సందేశాన్ని విడుదల చేసిన బాలయ్య  
  • హిందూపురం పారిశ్రామికంగా ముందంజ వేస్తోంది 
  • హిందూపురంను కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించమన్న బాలకృష్ణ
Balakrishna appeals govt to announce Hindupur as district head quarter
పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హామీ ఇచ్చిన మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందని, వాణిజ్య, పారిశ్రామికంగా ముందంజ వేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

హిందూపురం పట్టణం పరిసరాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి, భవిష్యత్ అవసరాల కోసం కావాల్సిన ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి, వారి చిరకాల కోరిక అయిన హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని కోరారు.