Miram Taron: అరుణాచల్ ప్రదేశ్ బాలుడ్ని క్షేమంగా భారత్ కు అప్పగించిన చైనా

  • ఈ నెల 19న అదృశ్యమైన తరోన్
  • తమ అధీనంలో ఉన్నాడని సమాచారం అందించిన చైనా
  • చైనా బలగాలతో భారత సైన్యం చర్చలు
  • సానుకూలంగా స్పందించిన డ్రాగన్
China safely handed Arunachal Pradesh boy to Indian Army

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడ్ని చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించాయి. దాంతో తరోన్ మిస్సింగ్ వ్యవహారం సుఖాంతమైంది. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించడం తెలిసిందే. ఎగువ సియాంగ్ జిల్లా వాసి అయిన తరోన్ ఈ నెల 19 నుంచి ఆచూకీ లేకుండా పోయాడు.

అయితే అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందిస్తూ, సరిహద్దు ప్రాంతంలో మూలికల అన్వేషణ కోసం వెళ్లిన తరోన్ ను చైనా బలగాలు అపహరించాయని, మిగతావారు తప్పించుకున్నారని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత తరోన్ తమ అధీనంలో ఉన్నాడంటూ భారత సైన్యానికి చైనా బలగాలు సమాచారం అందించాయి.

దాంతో భారత సైన్యం చైనా బలగాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. చర్చలు ఫలించడంతో అరుణాచల్ ప్రదేశ్ లోని వాచా-దమై ప్రాంతాల మధ్య ఉన్న ఇంటరాక్షన్ పాయింట్ వద్ద చైనా తరోన్ ను భారత సైన్యానికి అప్పగించింది.

తరోన్ అప్పగింతను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎంతో సామరస్యపూర్వకంగా, నేర్పుగా వ్యవహరించి బాలుడి విడుదలకు కృషి చేశారంటూ భారత సైన్యాన్ని మంత్రి అభినందించారు. కాగా, తరోన్ కు భారత సైనికాధికారులు వైద్య పరీక్షలు, ఇతర లాంఛనాలు నిర్వహించనున్నారు.

More Telugu News