Vijayashanti: రాజకీయాల్లో నా ప్రస్థానం ప్రారంభమై నిన్నటితో 24 సంవత్సరాలు: విజయశాంతి

  • 1998 జనవరి 26న బీజేపీలో చేరిన రాములమ్మ
  • నిన్న విజయశాంతికి శుభాకాంక్షల వెల్లువ
  • అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తాజాగా ట్వీట్
Vijayasanthi thanked every one who wishes on her political career

సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ ఖ్యాతి సంపాదించిన విజయశాంతి, ఆపై రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. ప్రస్తుతం విజయశాంతి బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో విజయశాంతి తన రాజకీయ ప్రస్థానంపై సోషల్ మీడియాలో స్పందించారు. నిన్నటితో తన రాజకీయ జీవితానికి 24 ఏళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

తాను 1998 జనవరి 26న రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం 25వ పడిలోకి ప్రవేశించిన సందర్భంగా తనకు అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసిన అభిమానులు, శ్రేయోభిలాషులకు వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మీ అందరి ఆదరాభిమానాలను ఎప్పటికీ ఇలాగే నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

ఇక ఆమె రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే.. విజయశాంతి మొదట బీజేపీలో చేరారు. తదనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అక్కడా ఇమడలేకపోయారు. 2020లో మళ్లీ బీజేపీ గూటికే చేరారు.

More Telugu News