Bonda Uma: గవర్నర్ ను కలిసిన టీడీపీ బృందం.. ఆయన కొడాలి నాని కాదు, కేసినో నాని అన్న బొండా ఉమ!

  • కేసినో గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ బృందం
  • డ్యాన్స్ చేసిన యువతుల వివరాల అందజేత
  • కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని విన్నపం
TDP leaders meets Governor

గుడివాడలో కేసినో జరిగిందనే ఆరోపణలు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపాయి. టీడీపీకి చెందిన నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు రూపొందించిన నివేదికను చంద్రబాబుకు అందజేశారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీలోని సభ్యులు ఈరోజు రాష్ట్ర గవర్నర్ ను కలిసి నివేదికతో పాటు, వీడియో సాక్ష్యాలను కూడా అందజేశారు.

కేసినోలో డ్యాన్స్ చేసిన యువతులు ఈ నెల 17న విజయవాడ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి, అక్కడి నుంచి గోవాకు వెళ్లినట్టు ప్యాసెంజర్ లిస్టు, వారికి టికెట్లు బుక్ చేసిన వ్యక్తి ఫోన్ నెంబర్లతో పాటు నివేదికను గవర్నర్ కు అందజేశారు. గుడివాడ పర్యటన సందర్భంగా తమపై దాడి గురించి కూడా వివరించారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. కేసినో వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను కూడా గవర్నర్ కు అందించారు.

గవర్నర్ ను కలిసి వచ్చిన తర్వాత మీడియాతో బొండా ఉమ మాట్లాడుతూ ఆయన కొడాలి నాని కాదు కేసినో నాని అని ఎద్దేవా చేశారు. కేసినోపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. కేసినో జరిగిందని సాక్ష్యాధారాలతో బయటపెడితే... సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లు మాత్రం చూడలేకపోతున్నారని అన్నారు. కేసినోపై వీరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

గుడివాడలో వైసీపీ నేతలు విష సంస్కృతిని ప్రవేశ పెట్టారని, కొడాలి నాని అసభ్యకర పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి పోతుందనే భయంతో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. మరోవైపు గవర్నర్ ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా ఉన్నారు.

More Telugu News