క్యాసినో డ్యాన్స్ అంటూ గోవా నుంచి అమ్మాయిల‌ను ర‌ప్పించారు: సోము వీర్రాజు

27-01-2022 Thu 13:38
  • స్వ‌యంగా మంత్రులే హిందూ సంస్కృతిని దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు
  • మ‌న సంస్కృతి దెబ్బ‌తిన్న‌ద‌నడానికి గుడివాడ క్యాసినో వ్య‌వ‌హార‌మే నిద‌ర్శ‌నం
  • స్క‌ర్ట్ లు వేసుకునే అమ్మాయిల‌ను రప్పించ‌డం ఏంటీ? 
  • క్యాసినో సంస్కృతిని గుడివాడ‌కు తీసుకొస్తారా?
somu veerraju slams ycp
గుడివాడ‌లో క్యాసినో వ్య‌వ‌హారంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మ‌రోసారి మండిప‌డ్డారు. ఈ రోజు విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ''గుడులు, గోపురాల‌పై దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయ‌లేదు? ఎన్నో గుడులను ధ్వంసం చేసిన వారిని ఎందుకు ప‌ట్టుకోలేదు? హిందూ మ‌తానికి, సంస్కృతికి వైసీపీ అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా? ప్ర‌జ‌ల డ‌బ్బుతో చ‌ర్చిలు, మ‌సీదులు క‌ట్టిస్తున్నారు.

స్వ‌యంగా మంత్రులే హిందూ సంస్కృతిని దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌న సంస్కృతి దెబ్బ‌తిన్న‌ద‌నడానికి గుడివాడ క్యాసినో వ్య‌వ‌హార‌మే నిద‌ర్శ‌నం. క్యాసినో డ్యాన్స్ అంటూ నాని గారు గోవా నుంచి డ్యాన్స్ చేసే అమ్మాయిల‌ను ర‌ప్పించారు. స్క‌ర్ట్ లు వేసుకునే అమ్మాయిల‌ను రప్పించ‌డం ఏంటీ?  

పైగా సంక్రాంతి పండుగ సంబ‌రాలు అంటూ చెబుతున్నారు. సంక్రాంతికి గంగిరెద్దులు, హ‌రిదాసులు, ముగ్గుల‌ పోటీలు ఉంటాయి. పండితుల‌కు స‌న్మానాలు చేస్తారు. మేము ఆ సంస్కృతిని నేర్పించాల‌ని వెళ్లాం. బీజేపీ నేత‌ల‌ను అరెస్టు చేస్తారా? క్యాసినో సంస్కృతిని గుడివాడ‌కు తీసుకొస్తారా? వైసీపీ శ్రేణుల‌కు సంస్కృతి గురించి నేర్పాల‌నే ఉద్దేశంతోనే గుడివాడ‌లో సంక్రాంతి ముగింపు సంబ‌రాలు చేశాం'' అని సోము వీర్రాజు చెప్పారు.