కొన్ని జిల్లాలకు ఈ పేర్లు పెట్టండి: జగన్ కు ముద్రగడ పద్మనాభం లేఖ

26-01-2022 Wed 19:03
  • గోదావరి జిల్లాల్లోని ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టండి
  • రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలి
  • కోనసీమ జిల్లాకు బాలయోగి పేరు పెట్టండి
Mudragada writes letter to Jagan on new district names
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 13 జిల్లాల స్థానంలో 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త జిల్లాలపై ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కొత్త జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాకు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని కోరారు. కోనసీమలోని జిల్లాకు దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి పేరు పెట్టాలని విన్నవించారు.