ఓటీటీ దిశగా 'రాధేశ్యామ్'?

26-01-2022 Wed 18:31
  • రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధే శ్యామ్'
  • ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే
  • కరోనా కారణంగా విడుదల వాయిదా
  • రిలీజ్ ఎప్పుడనేది చెప్పలేని పరిస్థితి  
  • ఓటీటీ నుంచి వచ్చిన భారీ ఆఫర్ 
Radhe Shyam movie update
ప్రభాస్ - పూజ హెగ్డే కాంబినేషన్లో 'రాధేశ్యామ్' రూపొందింది. యూవీ క్రియేషన్స్ .. టి - సిరీస్ .. గోపీకృష్ణ మూవీస్ వారు కలిసి, 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. తాను మనసిచ్చిన ఒకమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో, ఆమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే ఈ సినిమా.

సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రత పెరుగుతూ వెళుతుండటంతో వాయిదా వేసుకున్నారు. దాంతో ఈ సినిమా వేసవిలో థియేటర్లకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు .. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి తగ్గుముఖం పట్టే అవకాశాలు లేకపోవడం .. అప్పటివరకూ ఎదురుచూడలేని పరిస్థితి ఉండటం .. ఈలోగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి భారీ ఆఫర్ రావడం కారణంగా మేకర్స్ ఆ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.