డ్రగ్స్ వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్

26-01-2022 Wed 16:39
  • నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ కంట్రోల్ సెల్ ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశం
  • ఈ విభాగంలో పని చేయనున్న వెయ్యి మంది పోలీసులు
  • డీజీపీ ఆధ్వర్యంలో పని చేయనున్న ప్రత్యేక విభాగం
KCR orders to control drugs in Telangana
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ కూడా డ్రగ్స్ కేసులతో అల్లాడిపోయింది. మరోవైపు డ్రగ్స్ భూతంపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి గాను దాదాపు 1,000 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ (కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్)ను ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

ఈ ప్రత్యేక విభాగం డీజీపీ ఆధ్వర్యంలో పని చేయనుంది. డ్రగ్స్ ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ఈ విభాగం విధులను నిర్వర్తించనుంది. మరోవైపు డ్రగ్స్ ను నియంత్రించేందుకు, కఠిన చర్యలను చేపట్టేందుకు ఈనెల 28న 'స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్' జరపాలని నిర్ణయించారు.