Cricket: ‘ఓర్వలేకపోయారు’ అన్న రవిశాస్త్రి వ్యాఖ్యలకు హర్భజన్ కౌంటర్

  • ఎవరి గురించి చేశారో అంటూ విమర్శ
  • ఆ ఓర్వలేని వారెవరో తనకూ తెలియదని వెల్లడి
  • భారతీయులంతా కోహ్లీ కెప్టెన్సీని గర్వంగా ఫీలవుతామని కామెంట్
Harbhajan Counter Statement For Ravi Shastri What Did Bhajji Say

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రికి.. మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కౌంటర్ ఇచ్చాడు. టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ మరో రెండేళ్లు కొనసాగి ఉండేవాడని, కానీ, అతడి విజయాలను చూసి చాలా మంది ఓర్వలేకపోయారని నిన్న రవిశాస్త్రి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలపై భజ్జీ స్పందించాడు. ఎవరి గురించి శాస్త్రి ఆ కామెంట్లు చేశాడో అంటూ కౌంటర్ ఇచ్చాడు.

‘‘కోహ్లీ మరో 15 నుంచి 20 టెస్టు మ్యాచులు గెలిచి ఉండేవాడని శాస్త్రి అంటున్నారు. తద్వారా అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ గా అతడు నిలిచేవాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ విజయాలను చూసి ఓర్వలేకపోతున్నారని శాస్త్రి అన్నారు. అది చాలా పెద్ద ప్రకటన. శాస్త్రి ఎవరి గురించి మాట్లాడారో.. ఆ ఓర్వలేని వారెవరో నాకైతే తెలియదు. కానీ, ఒక్కటి మాత్రం చెప్తాను.. మా భారతీయులంతా కెప్టెన్ గా కోహ్లీ ప్రస్థానంపై గర్వంగా ఫీలవుతున్నాం. మరో 40 మ్యాచ్ లు గెలవాలని ఆకాంక్షించాం. ఏ క్రికెటరూ సాధించలేని ఘనతలకు రెండింతలు సాధించాలని కోరుకున్నాం’’ అని హర్భజన్ అన్నాడు.

స్వదేశంలో మ్యాచ్ లు జరిగినంత మాత్రాన.. తమకే అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఎలా అనుకుంటామని భజ్జీ ప్రశ్నించాడు. ఒకవేళ కోహ్లీ ఇంకా కెప్టెన్ గా కొనసాగి ఉంటే.. ఆ మ్యాచ్ లలో గెలిచేవారా? లేదా? అనేది కాలమే నిర్ణయించేదన్నాడు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ లో.. మొదటి బంతి నుంచే స్పిన్ తిరిగే పిచ్ లపై భారత్ మ్యాచ్ లు ఆడబోదని తాను అనుకుంటున్నానని చెప్పాడు. బ్యాటర్లకూ మంచి అవకాశం వచ్చే పిచ్ లనే కోరుకుంటారని భావిస్తున్నానన్నాడు.

రెండు మూడేళ్ల గణాంకాలు చూస్తే.. మన బ్యాటర్లు పరుగులు ఎలా చేయాలో మరచిపోయినట్టున్నారని భజ్జీ కామెంట్ చేశాడు. బ్యాటర్లలో నమ్మకం కూడా సన్నగిల్లి ఉండొచ్చన్నాడు. పరుగులు రానప్పుడు ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. ఇంట జట్టు సిరీస్ లు గెలుస్తున్నప్పటికీ.. ఆటగాళ్లు మాత్రం ఎదగట్లేదని వ్యాఖ్యానించాడు.

More Telugu News