‘నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ?’.. వర్మ ‘కొండా’ ట్రైలర్ చూశారా?.. ఇదిగో వీడియో

26-01-2022 Wed 14:12
  • రిపబ్లిక్ డే సందర్భంగా ట్రైలర్ వదిలిన వర్మ
  • ఆద్యంతం ఆకట్టుకున్న డైలాగులు
  • వర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ట్రైలర్
Varma Releases Konda Trailer On The Occasion Of Republic Day
కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘కొండా’ సినిమా ట్రైలర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా..   రామ్ గోపాల్ వర్మ వదిలారు. ‘‘అల్ట్రా డైనమిక్ దంపతులు కొండా మురళీ, కొండా సురేఖ జీవిత సమాహారం ‘కొండా’ సినిమా ట్రైలర్ మీకోసం’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

‘‘సమాజం గురించి నీతులు చెప్పుడు కాదు.. బాగు చెయ్యాలె.. పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’’ అంటూ తెలంగాణ యాసలో వర్మ వాయిస్ ఓవర్ తో సాగే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు పుట్టుకొస్తారంటూ 180 ఏళ్ల క్రితం కార్ల్ మార్క్స్ చెప్పారని, సమాజంలోని పరిస్థితుల మధ్య పుట్టిన వ్యక్తి కొండా మురళీ అని చెబుతూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కొండా మురళీగా త్రిగణ్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. కొండా సురేఖ పాత్రలో ఈరా మోర్ నటించింది. చివర్లో త్రిగణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘నా పేరు కొండా మురళీ.. ఏ మురళీ?’ అన్న డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మొత్తంగా సినిమాను వర్మ ఆకట్టుకునేలా తీసినట్టు అర్థమవుతోంది.