చిరంజీవి కాదు.. నేటి 'గుడ్ లక్ సఖి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా రామ్ చ‌ర‌ణ్‌

26-01-2022 Wed 13:12
  • చిరుకి క‌రోనా పాజిటివ్
  • ఆయ‌న స్థానంలో చెర్రీ
  • హైద‌రాబాద్‌లో ఈవెంట్‌
ramcharan to attend as chief guest
కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న 'గుడ్ లక్ సఖి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సందర్భంగా ఈ రోజు హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్న విష‌యం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని ఆ చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

అయితే, త‌న‌కు గ‌త రాత్రి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని మెగాస్టార్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయన కుమారుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ఈ ఈవెంట్‌కు హాజ‌రుకానున్నాడు. ఈ విష‌యాన్ని ఆ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.

                     
కాగా, రైఫిల్ షూటింగ్ క్రీడ బ్యాక్ డ్రాప్ లో గుడ్ లక్ సఖి సినిమా నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో  ఆది పినిశెట్టి, జగపతిబాబు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ప‌ల్లెటూరి ప‌డుచు అమ్మాయి త‌నకున్న‌ బ్యాడ్ ల‌క్ ముద్రను చెరిపేసుకుని, గుడ్ ల‌ఖ్ స‌ఖిగా ఎలా మారింద‌న్న అంశంపై ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ప్ర‌స్తుతం రామ్ చర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిచేయగా, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. అలాగే, చిరంజీవి ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధం కాగా, భోళా శంక‌ర్ సినిమాలోనూ ఆయ‌న న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్‌లో కీర్తి సురేశ్ కూడా న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.