KCR: అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?: ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనపై విజ‌య‌శాంతి

  • తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది
  • చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్ దాడులు చేయిస్తోంది
  • భయపెట్టాలని చూస్తే... వెన్నుచూపే ప్రసక్తే లేదు
  • మా పార్టీ కార్యకర్తలు అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులు   
  • ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయమన్న విజయశాంతి 
vijaya shanti slams kcr

బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ వాహ‌నంపై దాడి జ‌ర‌గ‌డం క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, పోలీసుల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. సీఎం కేసీఆర్ కుట్రలను కసిగా తిప్పికొడుతూ తిరగబడటం ఖాయమ‌ని విజ‌య‌శాంతి హెచ్చ‌రించారు.

''తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్... రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటు.

నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం చేస్తుంటే... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోంది.

ఒక పార్లమెంట్ సభ్యుడికి రక్షణ కల్పించలేని పోలీసులు రాష్ట్రంలో ఉంటే ఎంత... లేకుంటే ఎంత? రాష్ట్రంలో నానాటికీ టీఆర్ఎస్ గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్న ఈ దగాకోరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఒక్కటే హెచ్చరిక.

దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే... వెన్నుచూపే ప్రసక్తే లేదు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన మా పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉంది. మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం'' అని విజ‌య‌శాంతి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

More Telugu News