పుజారా, రహానేలకు షాకిచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్ట్ ల గ్రేడ్ తగ్గింపు!

26-01-2022 Wed 12:54
  • కాంట్రాక్ట్ ముసాయిదా సిద్ధం చేసిన బీసీసీఐ
  • ‘ఏ’ నుంచి బీ గ్రేడ్ కు డిమోషన్
  • ఇషాంత్ శర్మదీ అదే పరిస్థితి
  • సిరాజ్.. సీ నుంచి ఏకి?
  • ఏ+ గ్రేడ్ లో రోహిత్, కోహ్లీ, బుమ్రా
BCCI Demotes Pujara and Rahane
ఇటీవలి కాలంలో చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఘోరంగా విఫలమవుతూ జట్టులో చోటుకే ఎసరు తెచ్చుకునే పరిస్థితి దాకా వచ్చారు. వరుస సిరీస్ లలో వైఫల్యంతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వారిద్దరికి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. వారి కాంట్రాక్టులకు సంబంధించి గ్రేడ్ లను తగ్గించినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే 2021 అక్టోబర్ నుంచి 2022కుగానూ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్స్ ముసాయిదాను వరల్డ్ కప్ పూర్తయిపోగానే బీసీసీఐ సిద్ధం చేసింది. దానిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ కాంట్రాక్టుల్లో ప్రస్తుతం గ్రేడ్ ఏలో ఉన్న పుజారా, రహానేలను గ్రేడ్ బీకి తగ్గించినట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఇషాంత్ శర్మ గ్రేడ్ నూ బీకి తగ్గించినట్టు పేర్కొంటున్నాయి. ఉమేశ్ యాదవ్ ను సీ గ్రేడ్ లోకి డిమోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు ఒకేసారి భారీ ప్రమోషన్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘సీ’ గ్రేడ్ లో ఉన్న  అతడు.. బీ గ్రేడ్ కు ప్రమోట్ కానున్నాడు. అయితే, ఏ గ్రేడ్ లోకీ మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అక్షర్ పటేల్ ను సీ నుంచి బీ గ్రేడ్ లోకి వేయనున్నట్టు సమాచారం.  

ఇక ప్రస్తుతం ‘ఏ ’ ప్లస్ గ్రేడ్ లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రాలు.. అదే గ్రేడ్ లో కొనసాగనున్నారు. కె.ఎల్. రాహుల్, రిషభ్ పంత్, మహ్మద్ షమీ, అశ్విన్, రవీంద్ర జడేజాలు ఏ గ్రేడ్ లోనే ఉంటారు.

‘‘టీ 20 వరల్డ్ కప్ అయిపోగానే కాంట్రాక్ట్ ల ముసాయిదాను తయారు చేశాం. దానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం. కొత్త ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే కాంట్రాక్టును తయారు చేశారు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో మెరుగ్గా రాణించాల్సిన బాధ్యత సీనియర్ ఆటగాళ్లపై ఉంటుందని అన్నారు. అశ్విన్ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, లేటు వయసులో రీఎంట్రీ ఇచ్చినా ప్రదర్శన బాగా చేస్తున్నాడని వివరించారు.

ప్రస్తుతం యువ ఆటగాళ్లైన రాహుల్, పంత్, సిరాజ్, శుభ్ మన్ గిల్ లపై బీసీసీఐ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తొలుత రాహుల్, పంత్ లను ఏ ప్లస్ గ్రేడ్ కు ప్రమోట్ చేయాలని భావించినప్పటికీ.. మళ్లీ వెనకడుగు వేసింది. పంత్ ను భవిష్యత్ నాయకుడిగా బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. అయితే, అందుకు మరింత సమయం పడుతుందనడంలో సందేహమైతే లేదు. గిల్ కూ ప్రమోషన్ దక్కినా.. గాయాల బెడదతో అతడూ పలు సిరీస్ లకు దూరమవుతున్నాడు.

కాగా, ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్న ఆటగాళ్లకు రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ లోని వారికి రూ.5 కోట్లు, బీ గ్రేడ్ ప్లేయర్లకు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ లో ఉన్న వారికి రూ.కోటి చొప్పున వార్షిక పారితోషికం అందిస్తారు.