Republic Day: దేశ వ్యాప్తంగా ఘ‌నంగా గణతంత్ర వేడుకలు.. రాష్ట్రప‌తి, ప్ర‌ధాని జెండా వంద‌నం

republic day celebrations in india
  • ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు
  • వాయుసేన విన్యాసాలు
  • ఏపీలో ఇందిరాగాంధీ మైదానంలో జెండా ఆవిష్క‌ర‌ణ‌
  • హైద‌రాబాద్‌లో రాజ్‌భ‌వ‌న్‌లో జెండా ఎగ‌రేసిన‌ త‌మిళిసై

దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జ‌రుగుతున్నాయి. ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకల సంద‌ర్భంగా ప‌లువురు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నారు. 2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చి, వీర మ‌ర‌ణం పొందిన‌ జమ్మూకశ్మీర్‌ పోలీసు ఏఎస్‌ఐ బాబురామ్‌కు అశోక్‌ చక్ర పురస్కారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

బాబురామ్‌ కుటుంబ సభ్యులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు. అనంత‌రం రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్ నిర్వ‌హించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఇందులో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు ప్రదర్శించింది. అలాగే, సుఖోయ్‌, జాగ్వర్‌ అపాచీ ఫైటర్ జెట్స్ విన్యాసాల్లో పాల్గొన్నాయి.  

మరోపక్క, 21 శకటాల ప్రదర్శన జరిగింది. ఇందులో 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు అవకాశం ద‌క్కింది. ఈ సారి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణ, ప‌శ్చిమ బెంగాల్ వంటి ప‌లు రాష్ట్రాల‌కు శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌ అవకాశం దక్కలేదు. కరోనా ప్రోటోకాల్స్ ప్ర‌కారం ఈ వేడుక‌ల‌ను చూసేందుకు అతిథుల‌కు ఏర్పాట్లు చేశారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతిచ్చారు. ఈ సారి ఈ వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఘ‌నంగా 73వ గణతంత్ర వేడుకలు జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన గ‌ణ‌తంత్ర‌ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్ పాల్గొన్నారు. గవర్నర్‌ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

హైదరాబాద్ లోని రాజ్ భ‌వన్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే భార‌త్‌ ముందుంద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News