human hair: మానవ శిరోజాల ఎగుమతులపై నిషేధం.. డీజీఎఫ్టీ నోటిఫికేషన్

  • ఏటా అధికారికంగా రూ.3,000 కోట్ల విలువైన శిరోజాల ఎగుమతి
  • ఎగుమతులను తక్కువ చేసి చూపిస్తున్న సంస్థలు
  • మయన్మార్ ద్వారా చైనాకు అక్రమ రవాణా
  • అన్ని రకాల శిరోజ ఎగుమతులపై నిషేధం విధించాలంటున్న పరిశ్రమ వర్గాలు 
Dgft Curbs On Raw Human Hair Exports

మానవుల ముడి శిరోజాల ఎగుమతులను నిషేధిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవ ఎగుమతుల విలువను తక్కువ చేసి చూపించడం, మయన్మార్ ద్వారా చైనాకు శిరోజాల అక్రమ రవాణాను  అరికట్టేందుకు డీజీఎఫ్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

భారతీయుల శిరోజాలకు చైనాలో మంచి డిమాండ్ ఉంది. మన శిరోజాలను నమ్ముకుని అక్కడ పెద్ద పరిశ్రమే నడుస్తోంది. ‘‘శుభ్రపరిచిన లేక శుభ్రపరచని శిరోజాలు, వ్యర్థ శిరోజాలు లేదా ఇతర ఏ రూపాల్లో ఉన్న మానవ శిరోజాలు అయినా వాటిని నియంత్రిత విభాగంలోకి తక్షణమే చేర్చుతున్నాం’’ అంటూ డీజీఎఫ్టీ తెలిపింది.

ఈ నిర్ణయాన్ని మానవ శిరోజ ఉత్పత్తుల తయారీ సంఘం స్వాగతించింది. ఈ నిర్ణయంతో అక్రమ రవాణాకు కళ్లెం పడుతుందని పేర్కొంది. అన్ని రకాల శిరోజాల ఎగుమతులపై నిషేధం విధించాలని సంఘం ప్రెసిడెంట్ బెంజమిన్ చెరియన్ డిమాండ్ చేశారు.

‘‘ప్రపంచంలో శిరోజాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది భారత్ మాత్రమే. 80 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. కానీ, కేవలం 2 శాతం శిరోజాల ఆధారిత విలువైన ఉత్పత్తులే ఇక్కడ తయారవుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ముడి సరుకు చైనాకు తరలిపోతుండడంతో ఇక్కడ ఉపాధి అవకాశాలను మనం నష్టపోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అధికారికంగా అయితే ఏటా రూ.3,000 కోట్ల విలువైన శిరోజాలు ఎగుమతి అవుతుంటే, అక్రమంగా అంతకంటే ఎక్కువే తరలిపోతున్నట్టు పరిశ్రమ చెబుతోంది.

  • Loading...

More Telugu News