President Of India: కరోనాపై పోరులో భారత ప్రస్థానం అపూర్వం: రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి

President Kovind addressed on Republic Day eve
  • కరోనా సంక్షోభం ముగిసేంత వరకు నిపుణుల సూచనలు పాటించండి
  • సైనికులు, పోలీసులపై ప్రశంసలు
  • కరోనా సమయంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు
  • యువ మానవ వనరులు దేశానికి వరం

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన పోరులో భారతదేశం సాగించిన ప్రస్థానం అపూర్వమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభం ముగిసేంత వరకు శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్న జాగ్రత్తలను పాటించాలని సూచించారు.

కరోనా మహమ్మారి పడగ విప్పిన తొలి ఏడాదిలోనే సదుపాయాలను పెంచుకున్నామని, రెండో ఏడాదిలో వ్యాక్సిన్లు తయారుచేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని రాష్ట్రపతి గుర్తు చేశారు. కొవిడ్ వంటి అదృశ్య శక్తితో పోరాటం కొనసాగిస్తూనే ఉండాలని, మహమ్మారి కట్టడి విషయంలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు.

దేశ సరిహద్దుల్ని, దేశంలో శాంతి భద్రతల్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు అభినందనీయులని ప్రశంసించారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి భారత గణతంత్రానికి పునాదులుగా నిలుస్తాయన్నారు.

తమ ప్రాణాలకు అపాయమని తెలిసినా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సవాళ్లను ఎదుర్కొని పనిగంటలను పక్కనపెట్టి మరీ కష్ట సమయంలో సేవలు అందించారని కొనియాడారు. కరోనా ప్రభావం నుంచి దేశం కోలుకుంటోందన్న రాష్ట్రపతి.. యువ మానవ వనరులు ఉండడం దేశానికి వరమని అన్నారు.

  • Loading...

More Telugu News