Buddhadeb Bhattacharjee: పద్మభూషణ్ పురస్కారం నాకొద్దు.. తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య

  • అవార్డు గురించి ఎవరూ చెప్పలేదన్న భట్టాచార్య
  • ఉదయమే ఆయన భార్యతో మాట్లాడామన్న కేంద్రం
  • అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు కూడా తెలిపారని వివరణ
Buddhadeb Bhattacharjee Rejects Padma Bhushan

కేంద్ర ప్రభుత్వం గత రాత్రి ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటించారు. ఈ అవార్డు గురించి తనకు ఎవరూ చెప్పలేదని, ఒకవేళ నిజంగానే తనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అయితే దానిని తాను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు పార్టీ సోషల్ మీడియాలో సంక్షిప్త ప్రకటన విడుదలైంది.

అయితే, కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిన్న ఉదయం ఈ అవార్డు విషయమై భట్టాచార్య భార్యతో మాట్లాడినట్టు తెలిపింది. ఇందుకు ఆమె అంగీకరించారని, పౌరపురస్కారానికి ఎంపిక చేసినందుకు హోంమంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు కూడా తెలిపారని పేర్కొంది.

కాగా, 77 ఏళ్ల బుద్ధదేవ్ భట్టాచార్య వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి ‘పద్మ’పురస్కారాలను తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే వాటిని ప్రకటించడానికి ముందే అవార్డు గ్రహీతలు వారి అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం గత రాత్రి ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, బుద్ధదేవ్ భట్టాచార్యతోపాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని కేంద్రం ఇలా ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలతో సత్కరిస్తుంది. ఈసారి నలుగురిని పద్మవిభూషణ్, 17 మందిని పద్మభూషణ్, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.

More Telugu News