జేడీ చక్రవర్తి, నేను ఆ రోజున బతికి బయటపడ్డాం: సినీ నటి మహేశ్వరి

25-01-2022 Tue 18:41
  • 'గులాబీ' ప్రమాదాన్ని గుర్తుచేసుకున్న మహేశ్వరి
  • జేడీ చాలా ఫాస్టుగా బైక్ నడిపాడు
  • బైక్ స్కిడ్ కావడంతో లోయలోకి వెళ్లాము
  • చెట్టు వల్ల ప్రమాదం తప్పింది  
 Maheshwari said about Gulabi movie incident
శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన కథానాయికగా మహేశ్వరి కొంతకాలం పాటు ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో ఆమె చేసిన హిట్ సినిమాల్లో 'గులాబీ' ఒకటి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఆ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'మేఘాలలో తేలిపొమ్మన్నది' గురించి ప్రస్తావించింది.

"ఆ సినిమాలో ఆ పాటకి ముందు నేను ఎప్పుడూ బైక్ ఎక్కింది లేదు. పైగా ఆ పాటలో బైక్ పై చాలా ఫాస్టుగా వెళ్లాలని జేడీతో కృష్ణవంశీ చెప్పారు. దాంతో నా భయం మరింత పెరిగిపోయింది. నిజంగానే జేడీ బైక్ ను చాలా ఫాస్టుగా నడిపాడు. పాట చిత్రీకరణ జరుగుతూ ఉండగా బైక్ స్కిడ్ అయింది.

అంతే ఒక్కసారిగా బైక్ లోయలోకి దూసుకుని వెళ్లింది. అసలు ఏం జరుగుతుందనేది నాకు అర్థం కాలేదు. మా అదృష్టం బాగుండి లోయకి ముందు ఒక చెట్టు ఉండటంతో బతికి బయటపడ్డాము. ఆ తరువాత మమ్మల్ని .. బైక్ ను అక్కడి నుంచి వెనక్కి లాగారు" అంటూ అప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంది.