బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై దాడి!

25-01-2022 Tue 17:13
  • ఆర్మూరు సమీపంలో కారుపై దాడి
  • 200 మంది అడ్డుకున్నారన్న అరవింద్
  • పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని మండిపాటు
TRS workers attacked BJP MP Arvind car
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఆర్మూరు సమీపంలోని ఇస్సపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన తర్వాత అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆర్మూరులో బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు 200 మంది తమను అడ్డుకున్నారని చెప్పారు. రోడ్డుకు అడ్డంగా టైర్లు వేసి కాల్చారని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారని చెప్పారు. పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని తెలిపారు.

టీఆర్ఎస్ కు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తాము పదేపదే చెపుతూనే ఉన్నామని, ఆ విషయం ఈరోజు మరోసారి రుజువయిందని ఎంపీ చెప్పారు. ఈ ఘటనపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.
.