Bopparaju: జీవోలన్నీ విడుదల చేశాక మంత్రుల కమిటీలు వేస్తారా?: బొప్పరాజు

  • పీఆర్సీ కోసం ఉద్యోగుల ఉద్యమం
  • రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
  • విజయవాడ ధర్నాలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు
  • విమర్శనాస్త్రాలు సంధించిన బొప్పరాజు, బండి, వెంకట్రామిరెడ్డి
Employees union leaders participates in employees agitation in Vijayawada

పీఆర్సీ, తదితర డిమాండ్లపై ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం తెలిసిందే. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నిరసనలో తాను ఇప్పటివరకు పాల్గొనలేదని, కానీ పీఆర్సీతో మొదటిసారి జీతం తగ్గే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం దీనిపై పునఃసమీక్ష చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.

అందుకే అన్నింటికీ సిద్ధపడే సమ్మెకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగుల కడుపు మండేలా జీవోలు తయారుచేశారని, ఇప్పుడు పోరాడకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమంలోకి వచ్చి పోరాడుతున్నామని అన్నారు.

ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ, ఉద్యోగులు నడిపిస్తున్న ఉద్యమం ఇది అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి చాలాసార్లు చర్చలు జరిపామని, కానీ ప్రభుత్వం చెప్పిందొకటి, చేసింది మరొకటి అని విమర్శించారు. ఉద్యోగ సంఘాల మధ్య ఎన్ని ఉన్నా, ఇప్పుడు తమ సంఘాలన్నీ ఏకమయ్యాయని బొప్పరాజు ఉద్ఘాటించారు. ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనలు వ్యక్తం చేస్తుంటే శత్రువుల మాదిరిగా చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

27 శాతం ఐఆర్ ప్రకటించి దాన్ని 23 శాతం చేస్తే తగ్గించినట్టు కాదా? అని ప్రశ్నించారు. జీవోలన్నీ విడుదల చేశాక మంత్రుల కమిటీలు వేస్తారా? అని నిలదీశారు. ఉద్యోగులది న్యాయబద్ధమైన పోరాటం అని ప్రజలు నమ్ముతున్నారని బొప్పరాజు అన్నారు. తమ ఉద్యమానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు.

ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగుల ఉద్యమం విజయవంతమవుతోందని వెల్లడించారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరారు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగా ఉండాలని చెప్పామని అన్నారు. అయితే సీఎం ఇచ్చిన తాయిలాలకు తామేమీ మురిసిపోలేదని స్పష్టం చేశారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యోగులు కొందరు వాట్సాప్ యుద్ధాలు చేస్తున్నారని, అయితే ఉద్యోగులందరూ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనాలని బండి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పలుచోట్ల ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పీఆర్సీతో కడుపుమండిన కారణంగానే ఉద్యోగులు మాట్లాడుతున్నారన్న అంశాన్ని ప్రభుత్వం అర్థంచేసుకోవాలన్నారు.

"మా డిమాండ్ల సాధన కోసమే మాట్లాడుతున్నాం. ఒకటి అనొద్దు... రెండు అనిపించుకోవద్దు" అని హితవు పలికారు. డిమాండ్ల సాధన పూర్తయ్యేవరకు ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని బండి శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. ఉద్యోగులు శాంతియుతంగా ఉద్యమించాలని సూచించారు.

More Telugu News