అనుష్క శర్మ కంపెనీతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ జట్టు.. రూ.400 కోట్లతో భారీ ఒప్పందం

25-01-2022 Tue 15:27
  • సోదరుడు కరణేశ్ తో కలిసి ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్’ నిర్వహణ
  • 8 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ చేసేందుకు ఓటీటీల ఒప్పందం
  • కన్ఫర్మ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఇంకా స్పందించని అమెజాన్
Amazon Prime and Netflix Strikes The 4 Billion Deal With Anushka Sharma Company
ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ ఉంది. చాలా సినిమాలు నేరుగా అందులోనే విడుదలవుతున్నాయి. వెబ్ సిరీస్ ల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అనుష్క శర్మ, ఆమె సోదరుడు కరణేశ్ కలిసి ఏర్పాటు చేసిన సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్’తో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లు జట్టుకట్టాయి.

రూ.400 కోట్లతో భారీ డీల్ ను సెట్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని అనుష్క శర్మ సోదరుడు కరణేశ్ ధ్రువీకరించాడు. ఒప్పందం ప్రకారం రాబోయే 18 నెలల్లో 8 సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా ప్లాట్ ఫాంలలో రిలీజ్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. వాటితో పాటు వేరే వాటిలోనూ మరికొన్ని సినిమాలు, సిరీస్ లను విడుదల చేయాల్సి ఉంటుందన్నాడు.

ఈ విషయాన్ని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేయగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా స్పందించలేదు. ఆ రెండు సంస్థల నుంచి అధికారిక ప్రకటన వచ్చాక మరిన్ని వివరాలను వెల్లడిస్తామని కరణేశ్ చెప్పాడు.