ఐపీఎల్ కొత్త ప్రాంచైజీ లక్నో పేరు ఇదే!

24-01-2022 Mon 22:07
  • లక్నో సూపర్ జెయింట్స్ గా నామకరణం
  • టీమ్ లోగో ఆవిష్కరణ
  • పేరును ప్రకటించిన ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా
Lucknow franchise name revealed
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో ఫ్రాంచైజీకి నామకరణం చేశారు. ఇకపై లక్నో ఫ్రాంచైజీని లక్నో సూపర్ జెయింట్స్ గా పిలవనున్నారు. తమ ఫ్రాంచైజీకి పేరును సూచించాలంటూ లక్నో జట్టు వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ ఆర్పీఎస్జీ అధినేత సంజీవ్ గోయెంకా తమ జట్టు పేరును అధికారికంగా వెల్లడించారు. కాగా, టీమ్ లోగోను కూడా నేడు ఆవిష్కరించారు.

ఐపీఎల్ లో రెండు కొత్త జట్లకు బీసీసీఐ బిడ్లు ఆహ్వానించగా, ఆర్పీఎస్జీ రూ.7090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ ముగ్గురు కీలక ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. లక్నో జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇతర ఇద్దరు ఆటగాళ్లు మార్కస్ స్టొయినిస్ (ఆస్ట్రేలియా ఆల్ రౌండర్), రవి బిష్ణోయ్ (భారత దేశవాళీ స్పిన్నర్).

కేఎల్ రాహుల్ కు రికార్డు స్థాయి ధర రూ.17 కోట్లు చెల్లించనున్నారు. స్టొయినిస్ కు రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్ కి రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ మిగతా ఆటగాళ్లను వేలంలో ఎంపిక చేసుకోనుంది. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్నారు.