Undavalli Arun Kumar: ఉద్యోగ సంఘాలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ

  • ఒకపక్క కరోనా బీభత్సం
  • మరొక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక‌ దుస్థితి అర్థం చేసుకోవాలి
  • స‌మ్మె చేయాల‌న్న ఆలోచ‌న వ‌ద్దు
Undavalli Arun Kumar wiriter letter to employees union

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై ఉద్యోగ సంఘాలు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. పీఆర్సీపై రాజీప‌డబోమని, చ‌ర్చ‌ల‌కూ రాబోమ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో ఆ సంఘాల‌ నేత‌ల‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ లేఖ రాశారు. ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తోంద‌ని, మరొక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక‌ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపవలసిందిగా ప్రార్థిస్తున్నానని ఆయ‌న పేర్కొన్నారు.

కొత్త పీఆర్సీ అమ‌లు చేయ‌డం వ‌ల్ల రూ.10,247 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని ఏపీ స‌ర్కారు చెబుతోంద‌ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే, త‌మ‌కు చిన్న‌ మొత్తంలో పెంచిన జీతాలు వ‌ద్దంటూ ఉద్యోగ సంఘాలు స‌మ్మెకు దిగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణంగా జీతాలు పెంచాల‌ని ఉద్యోగులు స‌మ్మెల‌కు దిగడం తాను చూశాన‌ని, అయితే, పెంచిన జీతాలు వ‌ద్దంటూ స‌మ్మెకు దిగ‌డం ఇదే ప్ర‌థ‌మం అయి ఉండొచ్చ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏమైనా, ఈ పరిస్థితులలో స‌మ్మెను ఆపాల‌ని ఆయ‌న కోరారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించాలని కోరుతున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.

మ‌రోవైపు స‌చివాల‌య ఉద్యోగుల సంఘం ఈ రోజు కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసింది. ఇత‌ర అసోసియేష‌న్ల‌తో క‌లిసి స‌మ్మెకు వెళ్లే అంశంపై చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. అయితే, ఉద్యోగులు చ‌ర్చ‌ల‌కు వ‌స్తార‌ని ఏపీ మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ, పేర్ని నాని ఎదురుచూస్తున్నారు. వారిద్ద‌రు ప‌లువురు అధికారుల‌తో క‌లిసి స‌చివాల‌యంలోని రెండో బ్లాక్‌లో ఉన్నారు. ఛాంబ‌ర్‌లోనే ఉద్యోగ సంఘాల నేత‌ల కోసం ఎద‌రుచూస్తున్నారు. పీఆర్సీపై చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఇప్ప‌టికే వారు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.


  

More Telugu News