సివిల్ సర్వీస్ కు సుభాష్ చంద్రబోస్ 1921లో రాజీనామా.. లేఖ ఇదిగో!

24-01-2022 Mon 12:08
  • సివిల్ సర్వీస్ ప్రాథమిక పరీక్షలో నాలుగో స్థానం
  • మెయిన్ పరీక్ష రాయకుండానే తప్పుకున్న నేతాజీ
  • జాబితా నుంచి తన పేరును తొలగించాలంటూ లేఖ
  • నాటి లేఖను పోస్ట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
Netaji Subhas Chandra Boses resignation letter from Indian Civil Service
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు వెళ్లాలని నిర్ణయించుకుని, 1921 ఏప్రిల్ 22న సివిల్ సర్వీసెస్ కు రాజీనామా చేస్తూ రాసిన లేఖ బయటకు వచ్చింది. దీన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇది సంచలనంగా మారింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రవీణ్ కశ్వాన్ ఈ లేఖను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘అప్పుడు ఆయనకు 24 ఏళ్లు. ఆయన రాసిన అసలైన లేఖ ఇది. జయంతి సందర్భంగా ఇవే నివాళులు’’అంటూ ట్వీట్ చేశారు.

నాటి బ్రిటిష్ ప్రభుత్వ సెక్రటరీ ఎడ్విన్ శామ్యూల్ మోంటగును ఉద్దేశించి బోస్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ‘‘సివిస్ సర్వీసెస్ ప్రొబేషనర్ల జాబితా నుంచి నా పేరును తొలగించాలని కోరుకుంటున్నాను. 1920లో నిర్వహించిన ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామ్ ద్వారా నేను ఎంపికయ్యాను. ఇప్పటి వరకు 100 పౌండ్ల అలవెన్స్ నాకు దక్కింది. నా రాజీనామాను ఆమోదించిన వెంటనే ఈ మొత్తాన్ని తిరిగి భారత కార్యాలయానికి జమ చేస్తాను’’ అంటూ లేఖలో బోస్ కోరారు.

1920 ఆగస్ట్ లో ఐసీఎస్ (ఇండియన్ సివిల్ సర్వీస్) పరీక్ష రాసిన బోస్ నాలుగో స్థానంలో నిలిచారు. 1921లో తుది పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కానీ, ఆయన సివిల్ సర్వీస్ కంటే, స్వాతంత్య్ర సాధనే తన మార్గంగా ఎంపిక చేసుకున్నారు.