Toddler: చిన్నారికి ఫోన్ ఇచ్చినందుకు షాక్.. రూ.1.4 లక్షల షాపింగ్!

  • న్యూజెర్సీలో విస్తుపోయే ఘటన
  • షాపింగ్ కార్ట్ లో ఫర్నిచర్ వస్తువులను సేవ్ చేసిన తల్లి 
  • ఫోన్ తీసుకుని ఆర్డర్ చేసిన చిన్నారి
  • గుర్తించని తల్లిదండ్రులు
  • డెలివరీ సిబ్బంది రాకతో షాక్  
Toddler accidentally orders furniture worth Rs 140000 online on his mothers phone

మీరు మీ చిన్నారికి ఫోన్ ఇస్తుంటారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు హాని చేస్తాయని ఎన్నో పరిశోధనలు హెచ్చరించాయి. వాటికి దూరంగా ఉంచాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయినా పిల్లల అల్లరి తట్టుకోలేక చాలా మంది తల్లిదండ్రులు వారికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వారి పనుల్లో వారు మునిగిపోతుంటారు. ఇలాంటప్పుడు కొన్ని ఊహించనవి కూడా జరుగుతాయి.

న్యూజెర్సీ లో కూడా అలాగే ఆశ్చర్యపోయే ఘటన జరిగింది. ప్రమోద్ కుమార్, మధు దంపతులకు 22 నెలల అయాన్ష్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ చిన్నారి మహా జాదూ. ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుకోవడం, యూట్యూబ్ వీడియోలకు పరిమితం కాలేదు. ఏకంగా వాల్ మార్ట్ షాపింగ్ యాప్ తెరిచి, కార్ట్ ను ఓపెన్ చేసి అందులో వున్నవన్నీ ఆర్డర్ చేసేశాడు. వాటి విలువ మన కరెన్సీలో చూస్తే 1.4 లక్షలు!  

ఒక రోజు పెద్ద వాహనం ప్రమోద్ కుమార్ ఇంటి ముందు ఆగింది. ఒక్కొక్కటిగా వారు పెద్ద పెద్ద కార్టాన్లను డెలివరీ చేస్తున్నారు. ఇది చూసి సందేహంతో మధు తన ఫోన్ లో వాల్ మార్ట్ యాప్ తెరిచి ఆర్డర్లను చెక్ చేసింది. అందులో తను ఇటీవల కొన్ని ఫర్నిచర్ వస్తువుల్ని ఎంపిక చేసి కార్ట్ లో సేవ్ చేసింది. వాటిని ఆర్డర్ చేసినట్టు అందులో కనిపించింది. దీంతో తాను చేయకుండా, ఎవరు ఈ పనిచేశారో ఆమెకు మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత తమ అల్లరి కొడుకే ఈ పనిచేసినట్టు తెలుసుకుంది. ముందు షాక్ అయినా.. తర్వాత తేరుకుని 'వార్నీ .. ఇంతపని చేశావా?' అంటూ ఆనందంతో డెలివరీ అయిన బాక్స్ లపై అయాన్ష్ ను కూర్చోబెట్టి ఫొటో తీశారు.

‘చిన్నారి ఈ పని చేశాడంటే నమ్మడానికే కష్టంగా ఉంది. కానీ ఏం జరిగిందో?’ అంటూ ప్రమోద్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిజానికి షాపింగ్ కార్ట్ లో యాడ్ చేసినవన్నీ కొనుగోలు చేయడానికి కాదు. తర్వాత వాటిల్లో కొన్నింటిని ఎంపిక చేసి కొత్త ఇంటికోసం తెప్పించుకుందామని చిన్నారి తల్లి మధు అనుకుంది. ఏదైతేనేమి ఫోన్ ఇచ్చినందుకు తల్లిదండ్రులకు శ్రమ లేకుండా చేశాడు చిన్నారి. మరోసారి జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక కూడా తన చర్యతో పంపాడు.

More Telugu News