అవసరమైతే ఎస్పీకి మద్దతిస్తామన్న ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ పరిస్థితి దయనీయమన్న మాయావతి

24-01-2022 Mon 09:57
  • మద్దతు కావాలంటే షరతులు అంగీకరించాల్సి ఉంటుందన్న ప్రియాంక
  • యువకులు, మహిళలకు మా అజెండా అమలు చేయాలన్న పార్టీ ప్రధాన కార్యదర్శి
  • కాంగ్రెస్‌కు ఓటేసి ఓటును వృథా చేసుకోవద్దన్న మాయావతి
will support SP if needed says priyanka Gandhi
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ గట్టిపట్టుదలగా ఉండగా, ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ మాత్రం కొన్ని సీట్లు అయినా గెలుచుకుని పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎన్నికల తర్వాత అవసరమైతే కనుక సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇస్తామని, ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రియాంక ప్రకటించారు. అయితే, మహిళలు, యువకులకు కాంగ్రెస్ అజెండాను అమలు చేస్తామన్న షరతులకు ఆ పార్టీ అంగీకరించాల్సి ఉంటుందని చెప్పారు.

మరోపక్క, ఎస్పీకి మద్దతు ఇస్తామన్న ప్రియాంక వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ సీఎం అభ్యర్థిని గంటల్లోనే మార్చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలు తమ ఓట్లను కాంగ్రెస్‌కు వేసి వృథా చేసుకోవద్దని ఆమె పిలుపునిచ్చారు.