Nellore District: రావూరు అడవుల్లో ‘పుష్ప’ సీన్.. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లతో దాడి

Pushpa movie sciene in Ravuru forest red sandalwood smugglers caught
  • ముగ్గురు స్మగ్లర్లు, 55 మంది కూలీల అరెస్ట్
  • రెండు వాహనాల్లో పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
  • 45 ఎర్రచందనం దుంగలు, 24 గొడ్డళ్లు, 3 బరిసెలు స్వాధీనం
నెల్లూరు జిల్లా రావూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. తమను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు, గొడ్డళ్లు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని పోలీసులు ముగ్గురు స్మగ్లర్లు సహా పదుల సంఖ్యలో కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన వల్లూరు దాము, ఆయన వద్ద గతంలో పనిచేసిన కుప్పన్న సుబ్రహ్మణ్యానికి పుదుచ్చేరికి చెందిన పెరుమాళ్లు వేలుమలైతో పరిచయం అయింది. వేలుమలై తన బావమరిది అయిన రాధాకృష్ణన్ పళనిని దాముకు పరిచయం చేశాడు.

వీరందరూ ఓ గ్రూపుగా ఏర్పడి ఈ నెల 20న కూలీలతో కలిసి ఎర్రచందనం చెట్లు నరికేందుకు నెల్లూరు జిల్లా గూడూరు చేరుకున్నారు. అక్కడ వేలుమలైకి పరిచయం ఉన్న రైల్వేకోడూరుకు చెందిన చంద్రశేఖర్ సహాయంతో రావూరు అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికారు. అనంతరం దుంగలను వాహనంలో వేసుకుని ఈ నెల 21 రాత్రి తిరుగు పయనమయ్యారు. ఈ ఘటనపై ఉప్పందుకున్న పోలీసులు వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు. చెన్నై జాతీయ రహదారిలో శనివారం మధ్యాహ్నం ఎర్రచందనం దుంగలతో కూలీలు, స్మగ్లర్లు కలిసి రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.

చిల్లకూరు మండలం బూదనం గ్రామం వద్ద పోలీసులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన స్మగ్లర్లు.. పోలీసులపైకి గొడ్డళ్లు, రాళ్లు విసరడంతోపాటు వారిపైకి వాహనాలను ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వాహనాలను చుట్టుముట్టి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చేశారు. ముగ్గురు స్మగ్లర్లు, 55 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 45 ఎర్రచందనం దుంగలు, 24 గొడ్డళ్లు, 31 ఫోన్లు, 3 బరిసెలు, లారీ, టయోటా కారుతోపాటు రూ. 75 వేలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Nellore District
Ravuru Forest
Redsandal

More Telugu News