క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారులపై మంత్రి కుమారుడి కాల్పులు.. అనుచరుల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు

24-01-2022 Mon 07:28
  • బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఘటన
  • విషయం తెలిసి మంత్రి ఇంటిపై దాడికి వెళ్లిన గ్రామస్థులు
  • వారే తన కుమారుడిపై దాడి చేశారన్న మంత్రి
  • అమాత్యుడి ఇంటి నుంచి రైఫిల్, పిస్టల్ స్వాధీనం
Bihar ministers son opens fire to chase away children playing cricket on his farm
మామిడితోటలో క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారులపై మంత్రి కుమారుడు కాల్పులు జరిపిన ఘటన బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని హర్డియా గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ నేత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి నారాయణ ప్రసాద్ ఇంటి పక్కనే ఉన్న మామిడితోటలో నిన్న కొందరు చిన్నారులు, యువకులు కలిసి క్రికెట్ ఆడుతున్నారు. గమనించిన మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్, అతడి వెంట ఉన్న మంత్రి సిబ్బంది మామిడి తోటలోకి వెళ్లి అక్కడ క్రికెట్ ఆడొద్దని కోరారు.

వెళ్లేందుకు చిన్నారులు నిరాకరించారు. వారితో కలిసి ఆడుతున్న యువకులు కూడా అక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో వారి మధ్య వాగ్వివాదం మొదలైంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన మంత్రి కుమారుడు బబ్లూ.. కాసేపటికి నాలుగు వాహనాల్లో తన అనుచరులతో వచ్చి వారిపై దాడికి దిగారు. అంతటితో ఆయన కోపం చల్లారకపోవడంతో తన వద్ద ఉన్న తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపారు. ఇక, ఆయన అనుచరులు జరిపిన దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

విషయం తెలిసిన గ్రామస్థులు ఆగ్రహంతో రగలిపోయారు. మంత్రి ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. మరోవైపు, విషయం తెలుసుకున్న మంత్రి కుమారుడు బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. మంత్రి ఇంటి నుంచి పిస్టల్, రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. గ్రామస్థులపైనే ఆరోపణలు చేశారు. వారు తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని, తొలుత వారే తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. ఆ తర్వాత తన కుమారుడు లైసెన్స్ ఉన్న తుపాకితో మామిడి తోట వద్దకు వెళ్లాడని, అది చూసి అతడిపైనా గ్రామస్థులు రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.