ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత

23-01-2022 Sun 21:20
  • గుండెపోటుతో మృతి
  • ఆసుపత్రికి తీసుకెళుతుండగా తుదిశ్వాస విడిచిన సిద్ధాంతి
  • గతంలో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు
Famous astrologer Mulugu Ramalingeswara Siddhanti died
ప్రముఖ జ్యోతిషవేత్త, సుప్రసిద్ధ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. గత మూడు దశాబ్దాలుగా జ్యోతిష్యం, పంచాంగం చెబుతూ విశిష్ట గుర్తింపు అందుకున్నారు. పలు టీవీ చానళ్లలోనూ, పత్రికల్లోనూ ఆయన జ్యోతిష్య, పంచాంగ విశేషాలను ఎంతోమంది అనుసరిస్తుంటారు.

ఆయన పూర్తిపేరు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్. ఆయన స్వస్థలం గుంటూరు. అయితే హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.... ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగా మారకముందే ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు. పలువురు సినీ కమెడియన్లతో కలిసి అంతర్జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో జ్యోతిష్యం, వాస్తు, పంచాంగం అంశాల్లో రాణించారు. ఆయనకు శ్రీశైలంలో ఆశ్రమం కూడా ఉంది.