మంత్రి కొడాలి నాని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు: వర్ల రామయ్య

23-01-2022 Sun 18:57
  • రగులుతున్న కేసినో వ్యవహారం
  • తాను కేసినో నిర్వహించలేదన్న కొడాలి నాని
  • నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్
  • అన్ని ఆధారాలు ఉన్నాయన్న వర్ల రామయ్య
  • కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Varla Ramaiah fires on minister Kodali Nani
తాను కేసినో నిర్వహించినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అగ్రనేత వర్ల రామయ్య స్పందించారు. మంత్రి కొడాలి నాని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గుడివాడలో కేసినో కోసం ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేశారని ఆరోపించారు. అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినా ఇంకా బుకాయిస్తున్నారని తెలిపారు.

ప్రజలు అన్ని అంశాలను గమనిస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇలాంటి మంత్రిని సీఎం ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. కే కన్వెన్షన్ సెంటర్ లో కేసినో నడిపినట్టు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తక్షణమే కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.