భారతీయ ప్రొఫెసర్ కు సాయపడిన ఈజిప్ట్ ట్రావెల్ ఏజెంట్ కు షారుఖ్ ఖాన్ లేఖ

23-01-2022 Sun 17:25
  • ఈజిప్టు వెళ్లాలనుకున్న ప్రొఫెసర్ అశ్విని దేశ్ పాండే
  • ఏజెంట్ కు నగదు బదిలీలో ఇబ్బందులు
  • నగదు తీసుకోకుండానే టికెట్ బుక్ చేసిన ఏజెంట్
  • షారుఖ్ ఖాన్ పై అభిమానమే కారణం
SRK wrote letter to Egypt travel agent who helped Indian professor
అశ్విని దేశ్ పాండే... ఓ భారత ప్రొఫెసర్. ఇటీవల ఆమె ఈజిప్టు దేశానికి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ కు నగదు బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే, సాంకేతిక కారణాలతో నగదు బదిలీ కాకపోవడంతో ప్రొఫెసర్ అశ్విని దేశ్ పాండే ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.. నగదు బదిలీ కావడంలేదన్న విషయాన్ని ఈజిప్టులోని ట్రావెల్ ఏజెంట్ కు తెలియజేశారు. అయితే, అతడు స్పందించిన విధానం ఆమెను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఏజెంట్ ఏమన్నాడో అశ్విన్ దేశ్ పాండే ట్విట్టర్ లో వెల్లడించారు.

"మీది హీరో షారుఖ్ ఖాన్ ఉండే దేశమా? అయితే నో ప్రాబ్లమ్! మీపై నాకు నమ్మకం ఉంది. మీ టికెట్ బుక్ చేస్తాను... మీరు వచ్చిన తర్వాతే నాకు నగదు చెల్లించండి. ఇంకెక్కడైనా అయితే ఈ విధంగా చేసేవాడ్ని కాదు... కానీ షారుఖ్ ఖాన్ కోసం ఏమైనా చేస్తాను" అని బదులిచ్చాడని ఆమె వివరించారు. అనడమే కాదు చేశాడు కూడా అని ప్రొఫెసర్ అశ్విని పేర్కొన్నారు.

ఆ తర్వాత ప్రొఫెసర్ ఈజిప్టు వెళ్లడం, సదరు ఏజెంట్ కు నగదు చెల్లించడం జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్నంతా ఆమె షారుఖ్ ఖాన్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టయిన్ మెంట్ సిబ్బందికి తెలియజేశారు. వీలైతే, ఆ ఏజెంట్ కు, అతని కుమార్తెకు షారుఖ్ ఖాన్ ఫొటో ఏదైనా పంపగలరా? అని కోరారు. అందుకు షారుఖ్ ఖాన్ సిబ్బంది ఏకంగా మూడు ఫొటోలు పంపడమే కాదు, షారుఖ్ ఖాన్ స్వయంగా స్పందించి రాసిన లేఖను కూడా వాటికి జతచేశారు.