Supreme Court: అసదుద్దీన్​ ఒవైసీ, వారిస్​ పఠాన్​ వంటి ముస్లిం నేతలనూ అరెస్ట్​ చేయాలి.. హిందు నేతలను ఇరికించే కుట్ర చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు

  • హిందూసేన, హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సంస్థల పిటిషన్లు
  • ధర్మసంసద్ లో చేసిన వ్యాఖ్యలపట్ల హిందూనేతలను అరెస్ట్ చేయడంపై అసంతృప్తి
  • హిందువులపై చేసిన విద్వేష వ్యాఖ్యలపైనా విచారణ చేయాలని డిమాండ్
Arrest Muslim Leaders Too Hindu Outfits File Petitions In Supreme Court

ఇటీవల హరిద్వార్ లో నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానంద్, జితేంద్ర నారాయణ్ త్యాగిలను (అంతకుముందు వజీం రిజ్వి) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు దానికి కౌంటర్ గా రెండు హిందూ సంస్థలు సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ముస్లిం నేతలనూ అరెస్ట్ చేయాలంటూ కోరాయి. ఈ మేరకు హిందూ సేన, హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే గ్రూపులు వ్యాజ్యాలు దాఖలు చేశాయి.

హిందూయేతరులు హిందూ సంస్కృతిపై చేస్తున్న దాడులకు నిరసనగా చేసిన వ్యాఖ్యలే తప్ప.. వాటిని విద్వేష వ్యాఖ్యలుగా పరిగణించకూడదని వ్యాఖ్యానించాయి. హిందూ ఆధ్యాత్మికవాదులను నేరస్తులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా అన్నారు. హిందూ ధర్మ సంసద్ మీద పిటిషన్ వేసిన వ్యక్తి ముస్లిం అని, హిందూ సంస్థల కార్యకలాపాలను ప్రశ్నించే నైతిక హక్కు అతడికి లేదని పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ, వారిస్ పఠాన్ లూ ఎన్నోసార్లు విద్వేష వ్యాఖ్యలు చేశారని, వారిని కూడా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్ల  విచారణకు ఒప్పుకొన్న సుప్రీంకోర్టు.. హిందువులపై విద్వేష వ్యాఖ్యల కేసులనూ విచారించాలని హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ పిటిషన్ వేసింది. హిందువులపై ముస్లిం నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 25 సంఘటనలను పిటిషన్ లో వివరించారు.

More Telugu News