కోహ్లీకి వ్యతిరేకంగా కొంతమంది ప‌లు వ్యవహారాలు నడిపారు: అఖ్త‌ర్ వ్యాఖ్య‌లు

23-01-2022 Sun 13:33
  • అందుకే కోహ్లీ సార‌థ్య‌ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది
  • స్టార్ ఆట‌గాళ్ల‌కు ఇలాంటి ఇబ్బందులు తప్పవు
  • వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు
  • కొన్ని సార్లు ఇటువంటి పరీక్షలు తప్పవు
aktar on kohli captaincy
టెస్టు కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ రాజీనామా చేయ‌డంతో ఈ విష‌యంపై ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు త‌మ అభిప్రాయాలు తెలియ‌జేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌ మాజీ ఆట‌గాడు షోయబ్‌ అక్తర్ కూడా ఈ అంశంపై స్పందించాడు. భార‌త జ‌ట్టుకు కెప్టెన్సీ విషయంలో ఎదుర‌వుతోన్న స‌మ‌స్య‌ల‌ను పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని చెప్పుకొచ్చాడు.

సార‌థ్యం వ‌హించ‌డం అంత ఈజీ కాద‌ని, తీవ్ర ఒత్తిడి ఉంటుంద‌ని చెప్పాడు. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని ఆయ‌న ప్ర‌శంసించాడు. ఆయ‌న‌ క్రికెట్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఆడగలిగితే మరింత రాణిస్తాడని అన్నాడు. సార‌థ్యం వ‌హించే అంశంలో త‌లెత్తిన‌ వివాదంలోనే చిక్కుకుపోకుండా వాటన్నింటినీ మరచిపోవాలని అఖ్త‌ర్ తెలిపాడు.

కోహ్లీ రానున్న ఆరునెలల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల‌ని, అలా చేస్తే సార‌థ్య బాధ్య‌త‌ల‌ను వదులుకున్నందుకు ప్రతిఫలం దక్కుతుంద‌ని చెప్పాడు. మొత్తం 120 సెంచ‌రీలు పూర్తి చేయ‌గ‌ల‌న‌న్న విశ్వాసం కోహ్లీలో వస్తుందని తెలిపాడు. కోహ్లీకి వ్యతిరేకంగా కొంతమంది ప‌లు వ్యవహారాలు నడిపారని అఖ్త‌ర్ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలోనే కోహ్లీ సార‌థ్య‌ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆయ‌న అన్నాడు. స్టార్ ఆట‌గాళ్ల‌కు ఇలాంటి ఇబ్బందులు తప్పవని చెప్పాడు. అయితే, వీటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆటను ఆస్వాదించాలని చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు ఇటువంటి పరీక్షలు తప్పవని ఆయ‌న చెప్పుకొచ్చాడు. అన్నింటి నుంచి ధైర్యంగా బయటకు వ‌చ్చి, రాణించాల‌ని అన్నాడు.