జడ్జిని చంపిన నిందితులను తప్పించాలని చూస్తున్నారా?: సీబీఐపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

23-01-2022 Sun 13:22
  • ‘హిట్ అండ్ రన్’ కేసుగా మార్చాలని చూస్తున్నారంటూ ఆగ్రహం
  • కావాలనే హత్య చేసినట్టు నిందితుడే చెప్పాడు
  • నార్కో అనాలిసిస్ టెస్టులో నిజం ఒప్పుకొన్నాడు
  • అలాంటిది మొబైల్ ఫోన్ కోసమే ఆటోతో ఢీకొట్టారంటారా?
  • ధన్ బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యపై విచారణ
CBI trying to change the case to Hit And Run Jharkhand High Court On Dhanbad Judge Murder
ధన్ బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జడ్జిని చంపేసిన నిందితులను కాపాడేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రయత్నిస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఇంత అలసత్వంగా ఎందుకు ఉన్నారంటూ సీబీఐ అధికారులను నిలదీసింది. వాళ్ల తీరు చూస్తుంటే విచారణ నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది.  

గత ఏడాది జూలై 28న ఉదయం జాగింగ్ చేస్తున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను దుండగులు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ హత్య ఘటన మొత్తం స్థానిక సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలోనే జడ్జి హత్యపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దాదాపు ఆరు నెలలవుతున్నా హత్య కేసులో కదలిక లేకపోవడంతో ఝార్ఖండ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.


ఆటోతో ఢీకొట్టడానికి ముందే ఆనంద్ జడ్జి అన్న విషయం నిందితులకు తెలుసన్న విషయం నార్కో పరీక్షల్లో స్పష్టంగా తేలిందని, అలాంటప్పుడు మొబైల్ ఫోన్ ను దొంగిలించేందుకే వాళ్లు ఆటోతో ఢీకొట్టి చంపేశారంటూ సీబీఐ అధికారులు ఎలా చెప్తారని ఝార్ఖండ్ హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ రవి రంజన్, జస్టిస్ ఎస్ఎన్ ప్రసాద్ మండిపడ్డారు.

ఈ కేసులో విచారణ తీరు చూస్తుంటే సీబీఐ విశ్వసనీయత మీద సందేహాలు తలెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేయడం లేదా? అని ప్రశ్నించారు. సీబీఐ నిర్వహించిన నార్కో అనాలిసిస్ పరీక్షల్లో కావాలనే జడ్జిని ఢీకొట్టినట్టు నిందితుడు చెప్పాడని గుర్తు చేసింది. మళ్లీ నిందితులకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాల్సిన అవసరమేముందని నిలదీసింది.

కేసును ‘హిట్ అండ్ రన్’ కేసుగా మార్చాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఝార్ఖండ్ లో తీవ్రవాదం ఎప్పట్నుంచో ఉందన్న సంగతి తెలుసని, కానీ, ఎప్పుడూ ఒక జడ్జిని హత్య చేసిన దాఖలాలు లేవని అన్నారు. కాగా, కేసును సీబీఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి బదిలీ చేయాలని అదనపు అడ్వకేట్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.