కొవిడ్ ప్రభావంతో ఎక్కువ రోజులు కనిపించే సమస్యలు ఇవే..

23-01-2022 Sun 13:20
  • శ్వాసకోశ సమస్యలు
  • కండరాలు, నరాల నొప్పులు
  • అలసట, అయోమయం
  • వీటితో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించాలి
Worried about long COVID Here are the symptoms to spot it
కరోనా వైరస్ ప్రభావం విషయంలో వ్యక్తుల మధ్య వైరుధ్యం ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో 15 శాతం వరకే తీవ్ర సమస్యలను ఎదుర్కొని, ఆస్పత్రి పాలు కావాల్సిన పరిస్థితి. కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తే, కొందరిలో అసలు లక్షణాలు బయటకు కూడా కనిపించడంలేదు. రోగనిరోధక వ్యవస్థ, జన్యు నిర్మాణాన్ని బట్టి వ్యక్తుల మధ్య వైరస్ ప్రభావంలో ఈ వ్యత్యాసం కనిపించింది.

అయితే కరోనా వైరస్ కు గురైన వారిలో ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. కేవలం ఊపిరితిత్తులకు పరిమితం కాకుండా, గుండె జబ్బులు, కాలేయం, మానసిక, ఇతర అనారోగ్య సమస్యలకూ ఇది గురి చేసిందని చెప్పుకోవాలి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. కొవిడ్ వైరస్ తో ఇబ్బంది పడిన వారిలో ప్రధానంగా ఎక్కువ కాలంపాటు కొనసాగుతున్న సమస్యలను గుర్తించారు.

అలసట
కరోనా రోగుల్లో ఎక్కువ మందికి కనిపించే సమస్య అలసట. దీన్నే బలహీనత, నీరసంగా కొందరు భావిస్తుంటారు. కొంచెం పనికే చేతకావడం లేదన్న భావన అనిపిస్తుంది. అనారోగ్యం తర్వాత వచ్చే సమస్యే ఇదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఎక్కువ రోజుల పాటు దీంతో ఇబ్బంది పడుతుంటే వైద్యులను సంప్రదించాలి.

అయోమయం
దీన్నే ఏకాగ్రతలోపంగా (బ్రెయిన్ ఫ్రాగ్)గానూ పేర్కొంటారు. దేని గురించైనా ఆలోచిస్తుంటే అయోమయంగా అనిపించడం, ఆలోచించలేకపోవడం అని అర్థం చేసుకోవాలి. రోజువారీ దినచర్యల సందర్భంగా ఇది అనుభవం అయితే వైద్యులకు తెలియజేయాలి.

శ్వాసకోశ సమస్యలు
శ్వాస తీసుకోవడంలో భారంగా ఉండడం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకునే సమయంలో శబ్ధం ఇలాంటివి కరోనా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వేధిస్తుంటాయి. ఇటువంటి వారు వైద్యులను తప్పకుండా సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

నొప్పులు
నరాలు, కండాల నొప్పులు కొవిడ్ బాధితుల్లో ఎక్కువ రోజుల పాటు ఉంటున్నాయి. అలాగే, నిద్ర పరమైన అవాంతరాలు, శరీర కదలికల్లో అసౌకర్యం తదితర లక్షణాలు కరోనా తర్వాత కూడా కొందరిలో కనిపిస్తున్నాయి. ఇవి సాధారణంగా రెండు నుంచి మూడు నెలల పాటు కనిపిస్తున్నాయి. వీటి నుంచి పూర్తిగా బయటకు రావాలి. ఇందుకు వైద్యుల సాయం తప్పనిసరి.