DOLO 650: దివ్యౌషధం.. డోలో 650 ఆవిర్భావానికి నేపథ్యం ఇదీ..

  • డోలో 650, 1993లో ఆవిష్కరణ
  • జ్వర నియంత్రణకు సరైన మోతాదే దీని విజయం
  • 2021 సంవత్సరంలో రూ.307 కోట్ల అమ్మకాలు
  • ఇంత జనాదరణపై కంపెనీ ప్రమోటర్లలోనూ ఆశ్చర్యం
We did not expect this kind of popularity for DOLO 650

డోలో 650.. ఈ పేరు తెలియని వారు అరుదు. ప్రతి కుటుంబంలో ఒకరికి అయినా పరిచయం ఉన్న ఔషధం. జ్వరం, నొప్పులకు అతి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో మంచి ఉపశమనం కల్పించే డ్రగ్. జలుబులోనూ కొంత ఉపశమనాన్నిస్తుంది. అందుకే ప్రాథమిక ఔషధంగా ఇది ఎంతో పాప్యులర్ అయిపోయింది. ముఖ్యంగా కరోనా రాక ముందే ఎక్కువ మందికి పరిచయమున్న ఈ ఔషధం.. కరోనా వచ్చిన తర్వాత మరింత మంది నోళ్లల్లోకి వెళ్లిపోయింది.

డోలో 650 బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ ఉత్పత్తి. ఇందులోని ఇంగ్రేడియంట్ పారాసిటమాల్. క్రోసిన్, కాల్ పాల్ లాంటి ఎన్నో పారాసిటమాల్ బ్రాండ్లను వెనక్కి నెట్టి డోలో ముందుకు దూసుకుపోయింది. 2021లో ఏకంగా రూ.307 కోట్ల విలువైన డోలో 650 విక్రయాలు నమోదయ్యాయంటే ఈ బ్రాండ్ కు ఉన్న ఆదరణ ఏపాటిదో తెలుస్తోంది.

ఈ కంపెనీని దిలీప్ సురానా చైర్మన్, ఎండీగా నడిపిస్తున్నారు. ఫార్మా రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. కుటుంబ వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత మరింత పెద్దది చేశారు. డోలో 650 ఔషధాన్ని మార్కెట్ కు పరిచయం చేయడం వెనుకనున్న నేపథ్యాన్ని ఆయన ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు.

‘‘పారాసిటమాల్ 500 ఎంజీ మార్కెట్ ఎన్నో బ్రాండ్లతో రద్దీగా ఉంది. దాంతో అదే పారాసిటమాల్ తో మేము తీసుకొచ్చే బ్రాండ్ భిన్నంగా ఉండాలని కోరుకున్నాం. మార్కెట్ అధ్యయనం నిర్వహించాం. డాక్టర్లతో మాట్లాడాం. జ్వరాన్ని సమర్థవంతంగా నియంత్రించే విషయంలో పారాసిటమాల్ 500ఎంజీతో లోటు ఉందని గుర్తించాం. 500ఎంజీ మోతాదు సరిగ్గా నియంత్రించ లేకపోతున్నట్టు తెలుసుకున్నాం. ఆ లోటును భర్తీ చేసేందుకు డోలో 650 సమాధానం అని భావించి 1993లో దీన్ని ఆవిష్కరించాం’’అని వివరించారు.

మాత్ర పరిమాణం, ఆకృతి విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, పరిశోధన ద్వారా అధిగమించినట్టు దిలీప్ సురానా తెలిపారు. ‘‘డోలో 650 బ్రాండ్ కు ఇటీవలి కాలంలో ఇంత ఆదరణ వస్తుందని మేము ఊహించలేదు. ఎందుకంటే ఈ టాబ్లెట్ గురించి ప్రజలకు తెలిసేలా మేము ఎప్పుడూ ప్రకటనలు చేయలేదు’’అని చెప్పారు.

More Telugu News