New Zealand: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. పెళ్లి రద్దు చేసుకున్న న్యూజిలాండ్ ప్రధాని!

  • ఓ వివాహం తర్వాత పెరిగిన వైరస్ సామాజిక వ్యాప్తి
  • ‘రెడ్ సెట్టింగ్స్‌’లోకి న్యూజిలాండ్
  • నేటి రాత్రి నుంచి అమల్లోకి పలు ఆంక్షలు
New Zealand PM Jacinda Ardern cancels her wedding amid new Omicron restrictions

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు ఆంక్షలు విధించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెన్ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఓ వివాహం తర్వాత దేశంలో ఒమిక్రాన్ కేసుల సామాజిక వ్యాప్తి పెరగడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా మాస్క్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే, ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించింది. నేటి అర్ధరాత్రి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.

ఉత్తర ద్వీపంలోని ఆక్లాండ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ కుటుంబం దక్షిణ ద్వీపంలోని నెల్సన్‌కు విమానంలో వచ్చింది. ఈ కుటుంబంతోపాటు ఫ్లైట్ అటెండెంట్‌కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది.

కొవిడ్-19 ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా న్యూజిలాండ్ ఇప్పుడు ‘రెడ్ సెట్టింగ్స్’లోకి వెళ్లిపోతుంది. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బార్‌లు, రెస్టారెంట్లు, వివాహాలు వంటి కార్యక్రమాలకు 100 మందికి మించి హాజరు కావడానికి వీల్లేదు. ఈ వేదికల్లో వ్యాక్సినేషన్ పాస్‌లను ఉపయోగించకుంటే కనుక ఆ సంఖ్య 25కు పరిమితం అవుతుందని ప్రధాని జెసిండా తెలిపారు.

అంతేకాదు, తన వివాహాన్ని కూడా రద్దు చేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చిక్కుకున్నట్టు అయితే తనను క్షమించాలని కోరారు. అయితే, వివాహం తిరిగి ఎప్పుడు చేసుకునేది తేదీ వెల్లడించలేదు. పెళ్లి రద్దు చేసుకోవడాన్ని ఎలా భావిస్తున్నారన్న మీడియా ప్రశ్నకు జెసిండా బదులిస్తూ.. జీవితమంటే అదేనని పేర్కొన్నారు. కాగా, దీర్ఘకాల భాగస్వామి, ఫిషింగ్ షో హోస్ట్ క్లార్క్ గేఫోర్డ్‌ను జెసిండా వివాహం చేసుకోబోతున్నారు.

More Telugu News