అండర్-19 ప్రపంచకప్: దుమ్మురేపుతున్న యువ భారత్.. ఉగాండాపై 326 పరుగుల భారీ తేడాతో విజయం

23-01-2022 Sun 08:58
  • ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరిన భారత్
  • ప్రత్యర్థి బౌలింగును చీల్చి చెండాడిన బ్యాటర్లు
  • సెంచరీలతో చెలరేగిన రఘువంశీ, రాజ్‌బవా
  • 79 పరుగులకే కుప్పకూలిన ఉగాండా
Under 19 world cup team india crush uganda
అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువజట్టు చెలరేగిపోతోంది. ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరుకున్న భారత జట్టు నిన్న పసికూన ఉగాండాతో జరిగిన చివరి గ్రూప్-బి మ్యాచ్‌లో మరోమారు దుమ్మురేపింది. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. భారత బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

ఓపెనర్ రఘువంశీ 120 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 144 పరుగులు చేయగా, రాజ్ బవా 108 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో అజేయంగా 162 పరుగులు సాధించాడు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు రాకెట్‌లా దూసుకుపోయింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఉగాండా బౌలర్లలో కెప్టెన్ పాస్కల్ మురుంగి 72 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్టోఫర్ కిడేగా, యూనుసు చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం  406 పరుగుల కొండంత విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు 326 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ పాస్కల్ చేసిన 34 పరుగులే అత్యధికం. జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఖాతానే తెరవలేకపోయారు. భారత బౌలర్లలో కెప్టెన్ నిశాంత్ సింధు నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రాజవర్ధన్ 2 వికెట్లు పడగొట్టగా వాసు వత్స్, విక్కీ చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాట్‌తో విరుచుకుపడి అజేయ సెంచరీతో ఆకట్టుకున్న రాజ్ బవాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.