కాసినో వ్యవహారంలో కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన టీడీపీ నేతలు

22-01-2022 Sat 17:56
  • గుడివాడ కాసినో రగడ
  • మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల పోరు
  • కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞాపన
TDP leaders complains on Gudivada Casino to Krishna district collector
'గుడివాడలో కాసినో' అంటూ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల పోరాటం చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో టీడీపీ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నేడు కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ ను కలిసింది. గుడివాడలో కాసినో వ్యవహారంపై విచారణ జరపాలంటూ కమిటీ నేతలు కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య తదితర టీడీపీ ముఖ్యనేతలు ఉన్నారు.

కాగా, టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నిన్న గుడివాడ వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై పోలీసులు నేడు కేసులు నమోదు చేశారు. టీడీపీ, వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో పాటు మరో 26 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల్లో తోట నాగరాజు, మరో 19 మందిపై కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని ఓఎస్డీ శశిభూషణ్ పైనా కేసు నమోదైంది.