'జగన్ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి' అంటూ సోము వీర్రాజుపై వెల్లంపల్లి ఫైర్!

22-01-2022 Sat 17:34
  • జగన్ ను దేశద్రోహి అని కామెంట్ చేశారు.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి
  • కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తి సోము వీర్రాజు
  • వీర్రాజు దేశభక్తుడా లేక తెలుగుదేశం భక్తుడా?
Vellampalli fires on Somu Veerraju
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కార్పొరేటర్ గా కూడా గెలిచే స్థాయి లేని వ్యక్తి వీర్రాజు అని ఎద్దేవా చేశారు. సీఎంను దేశద్రోహి అంటూ కామెంట్ చేశారని... ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జగన్ చిటికెన వేలును కూడా తాకే స్థాయి వీర్రాజుకు లేదని అన్నారు.

గతంలో బీజేపీ వ్యక్తి ఏపీ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 40 దేవాలయాలను కూల్చేశారని వెల్లంపల్లి అన్నారు. వైసీపీ ప్రభుత్వం దేవాలయాలను కడుతోందని చెప్పారు. కేసినోలు గోవాలో ఉన్నాయని... అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. సోము వీర్రాజు దేశభక్తుడా? లేక తెలుగుదేశం భక్తుడా? అని ఎద్దేవా చేశారు. గుడివాడలో కేసినో అంశంపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారని అన్నారు. గుడివాడలో అశాంతిని సృష్టించేందుకు యత్నించారని మండిపడ్డారు.